30, జనవరి 2021, శనివారం

పవన్ కళ్యాణ్: కాపులు బలపడకూడదనే తూర్పు కాపు.. మున్నూరు కాపు అని విడదీశారు... కాపుల మధ్య తగాదాలుపెట్టారుదశాబ్దాలుగా  కాపు కులాన్ని విభజించి పాలిస్తున్నారు 
కాపు కులాన్ని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు 
రాజకీయ సాధికారత సాధించడం అవసరం
అధికారం ఎవరూ పిలిచి ఇవ్వరు... చేజిక్కించుకోవాలి   
ప్రతి కులంవారు తమ సమస్యలు నాకు తెలియచేస్తారు... అలాంటిది నేను పుట్టిన కులంవారు తమ సమస్యలు నాకు చెపితే తప్పేముంది?
కులం అంటగట్టేస్తారు అనే భయం లేదు 
నేను కులానికి... మతానికీ అతీతంగా అందరివాణ్ణి
కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో సమావేశంలో జనసేన అధ్యక్షులు  వన్ కల్యాణ్ 

కాపులతోపాటు ఆర్థికంగా, సామాజకంగా అణగారిన అన్ని వర్గాలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. 1930 నుంచే కాపు కులంలో విభజించు, పాలించు సిద్ధాంతం మొదలయ్యిదని, అది ఈ రోజుకీ కొనసాగుతుందన్నారు. కాపులకు రాజకీయ సాధికారిత వచ్చిన రోజు... మిగిలిన అన్ని వెనుకబడిన కులాలకు విముక్తి లభిస్తుందని చెప్పారు. బీసీ కులాలకు ఇబ్బంది లేకుండా కాపుల న్యాయమైన డిమాండ్లను జనసేన పార్టీ బలంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు.  

కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు రిజర్వేషన్ అంశాలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారు నేతృత్వంలోని బృందంతో సమావేశమయ్యారు.  అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుత “కులం అనేది మనం ఎంచుకునేది కాదు. మన ప్రమేయం లేకుండా మనం పుట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు రెల్లి కులంవారి అవస్థలు చూసి అట్టడుగు వర్గాల వారికి అండగా ఉండాలని రెల్లి కులాన్ని స్వీకరించాను. పొలిటికల్, సోషల్ ఫిలాసఫీని సంపూర్ణంగా అధ్యయనం చేసి రాజకీయాల్లోకి వచ్చాను. ఏదైనా మాట మాట్లాడితే కులం అంటగట్టేస్తారనే భయం నాకు లేదు.  ప్రతి కులం ప్రతినిధులు నా దగ్గరకు వచ్చి వారి సమస్యలు చెప్పుకొన్నప్పుడు.. నేను పుట్టిన కులం నా దగ్గరకు వచ్చి సమస్యలను విన్నవించుకోవడం తప్పేమి కాదు. దానికి కులం అంటగడతారనే భయం అవసరం లేదు. నా మనసు, ఆలోచన ప్రజలకు తెలుసు. నేను అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందివాడిని. ప్రతి కులంలో వెనకబాటు తనం గురించి మాట్లాడటానికి ఏ మాత్రం సంకోచించను. 

దామోదరం సంజీవయ్య గారిని గుర్తుంచుకోవాలి 

1891 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం కులాల ఆధారంగా జనాభా లెక్కలు మొదలు పెట్టడంతో ఈ రిజర్వేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. రాజ్యాంగం ఏర్పడి, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయే వరకు కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలు బీసీల్లోనే ఉండేవి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నీలం సంజీవరెడ్డి  కులాలను బీసీ జాబితా నుంచి తప్పించారు. తర్వాత శ్రీ దామోదరం సంజీవయ్య గారు  రిజర్వేషన్లు పునరుద్దరించారు. కాపులు దళితవర్గం నుంచి వచ్చిన గొప్ప నేత, ముఖ్యమంత్రిగా చేసిన శ్రీ దామోదరం సంజీవయ్య గారిని గుర్తుంచుకోవాలి. ఆ తరవాత  కొన్ని రాజకీయ శక్తుల కుయుక్తుల వల్ల బీసీ రిజర్వేషన్ కొనసాగలేదు.  ఈ సమయంలోనే కాపు కులంలో విభజించు, పాలించు అనే సిద్ధాంతం మొదలైంది. అది ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది.  తూర్పు కాపులు,  మున్నూరు కాపులు అని విడదీశారు. ఇప్పటికీ విడదీస్తూనే ఉన్నారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని ఎవరూ ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్లలేకపోయారు. 

చంద్రబాబు గారు కాపులు ఓసీలా, బీసీలా అనే మీమాంశలో పడేస్తే.. జగన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని చెప్పేశారు. ముందుగా కాపుల్లో చలనం వచ్చి, మథనం జరిగితే తప్ప రిజర్వేషన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లలేము.

అట్టడుగు వర్గాలను నలిపేస్తున్నారు

నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల్లో రామ్ మనోహర్ లోహియా గారు ఒకరు. ఆయన్ను అపారంగా గౌరవిస్తాను. ఆయన రాసిన భారతదేశంలో కులాలు అనే పుస్తకం నన్ను బలంగా హత్తుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కులాలకు   వెనకబాటుతనం, కాపుల గురించి ఆయన ప్రస్తవించిన విధానం, మిగతా కులాలను కలుపుకొని ఎలా ముందుకు వెళ్లాలని ఆయన చెప్పిన విధానం నన్ను లోతుగా అధ్యయనం చేసేలా చేసింది. 

రాజకీయంగా శాసించే శక్తులు, చట్టాలను చేతుల్లోకి తీసుకున్న కొంతమంది వ్యక్తులు అట్టడుగు వర్గాలను నలిపేస్తున్నారు. కాపులకు సాధికారిత వచ్చిన రోజున దళితులు, బీసీలు మిగత వెనుకబడిన కులాలకు వీళ్లందరి నుంచి విముక్తి లభిస్తుందని లోహియా గారు ఆ పుస్తకంలో రాశారు. 

కాపుల్లో 80 శాతం మంది దుర్భర స్థితిలో ఉన్నారు 

తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ను అమలు చేస్తుంటే ఇక్కడ మాత్రం తీసేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, హరిరామ జోగయ్య వంటి కొంతమంది వ్యక్తులను చూసి ఆ కులానికి రిజర్వేషన్ అవసరం లేదనుకున్నారేమో? కాపు కులంలో 15 నుంచి 20 శాతం మందిని పక్కన పెడితే 80 శాతం మంది దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారు. కాపులు బలపడకూడదని తూర్పు కాపులుగా, తెలంగాణలో మున్నూరు కాపులుగా కొన్ని దశాబ్దాల కిందటే విడదీశారు. కాపు, ఒంటరి, బలిజ కులాల మధ్య తగదాలు పెట్టారు. 

రాజకీయ శక్తులు నిరంతరంగా  చేస్తున్న దాడులను అందరూ గుర్తించాలి.  బలమైన ఐక్యత తీసుకొచ్చే ప్రక్రియ జరగాలి. ఏడు దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్న ఎందుకు వెనకబడిపోయామో కాపుల్లో ఆత్మపరిశీలన జరగాలి. రాజ్యాధికారాన్ని చేజిక్కుంచుకునే బలమైన సముహం ఉండి కూడా రాజ్యాధికారాన్ని శాసించే కొన్ని శక్తులకు ముడిసరకుగా ఉపయోగపడుతున్నాం. 

సంఘీభావం తెలిపిన వారిపై కేసులు అలానే ఉన్నాయి 

అధికారం అనేది ఎవరూ మనకి పిలిచి ఇవ్వరూ. మనమే దానిని చేజిక్కుంచుకునే స్థితిలో ఉండాలి. టీటీడీ బోర్డులో కాపులకు స్థానం ఇవ్వలేదని హరిరామ జోగయ్య గారు తెలిపారు. హక్కుల కోసం పోరాటం చేసేటప్పుడు క్రమ పద్ధతిలో విధివిధానాలు ఉండాలి. తుని అంటే అందరికి రైలు దుర్ఘటనే గుర్తొస్తుంది. ఆ దుర్ఘటన వల్ల కాపుల సహేతుకమైన డిమాండ్ మరుగునపడిపోయింది. భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. తుని రైలు దుర్ఘటనలో నమోదైన కేసులను జగన్ రెడ్డి గారి ప్రభుత్వం కొట్టేసింది. అయితే తుని ఘటనకు సంఘీభావంగా వివిధ జిల్లాల్లో నిరసన తెలిపిన వారిపై ఇంకా కేసులు నడుస్తునే ఉన్నాయి. వాటిని కూడా ఎత్తేయాలి. 

భారతదేశంలో కులాలను పక్కన పెట్టి రాజకీయం చేయలేము. కులాలను అర్ధం చేసుకొనే రాజకీయం చేయాలి. ఒక కులాన్ని భూజం మీద పెట్టుకొని ఊరేగే పరిస్థితి లేకుండా... ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించి వారిని అన్ని కులాలతో సమతుల్యం ఏర్పడేలా చేయాలి. కాపులు బలపేతం అవ్వడం అంటే బీసీలను బలహీనులను చేయడం కాదు. వారికి రావాల్సిన హక్కులను తిరిగి తెచ్చుకోవడం. కాపుల వెనుకబాటు తనం, అసంతృప్తిని మనస్ఫూర్తిగా అర్ధం చేసుకున్నవాడిగా చెబుతున్నాను... బీసీలకు ఇబ్బంది లేకుండా కాపుల న్యాయమైన డిమాండ్లను బలంగా ముందుకు తీసుకెళ్తాన”ని హామీ ఇచ్చారు.

చిరంజీవి గారు జనసేనలోకి వస్తున్నారా అని విలేకర్లు ప్రశ్నించగా శ్రీ పవన్ కల్యాణ్ గారు సమాధానమిస్తూ “అన్నయ్యగా  చిరంజీవి గారు తమ్ముడు అభివృద్ధిని కోరుకొంటారు. అన్నయ్య గారి ఆశీస్సులు ఉంటాయి. పార్టీలోకి వస్తారా అనేది ఇప్పుడే చెప్పలేను” అన్నారు.  

కాపు ముద్ర వేయడం ఇష్టంలేకే ఇన్నాళ్లు జనసేనను సంప్రదించలేదు: హరి రామ జోగయ్య 

కాపు సంక్షేమ సేన జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారు మాట్లాడుతూ “కాపు సంక్షేమ సేన ఏ పార్టీకి సంబంధించిన సంస్థ కాదు. మేము ఏ నాయకుడికీ అనుయాయులం కాదు. కాపుల అభ్యున్నతి కోసం, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేశాం. మా డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాం. ముఖ్యమంత్రి గారికీ, అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశాం. కేవలం ఒక్క జనసేన పార్టీకి మాత్రమే కుల ముద్ర ఎక్కడ పడుతుందోనన్న భయంతో ఇన్నాళ్లు దూరంగా ఉన్నాం. శ్రీ పవన్ కల్యాణ్ గారు కలగచేసుకుంటేనేగానీ డిమాండ్స్ సాధించలేమన్న నిర్ణయానికి వచ్చాం. కాపు ముద్ర పడినా పర్వాలేదు మాకు న్యాయం జరిగితే చాలు అన్న ఉద్దేశంతో మా సమస్యలు మీ దృష్టికి తీసుకువచ్చాం. మా డిమాండ్లు పరిశీలించి కాపులకు న్యాయం చేయమని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరుతున్నాం. 

ఒక పేద కులం, అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న కులం కోరికగా ప్రభుత్వం ముందు ఉంచండి. మేము ఇతర కులాల ప్రయోజనాలు కాపాడుతూ మాకు డిమాండ్లు పరిష్కారం అయ్యేలా చూడండి. మేము ఏ ఒక్క కులానికీ వ్యతిరేకం కాదు.

రాజకీయంగా సైతం కాపులను అణగదొక్కుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కనీసం ఒక్క కాపుకి కూడా అవకాశం ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనం. కాపుల్ని కేవలం రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవడం మినహా ఎవ్వరూ మాకు ఉపయోగపడలేదు” అన్నారు. ఈ సమావేశంలో కాపు సంక్షేమ సేన గౌరవ అధ్యక్షులు డా.యిర్రింకి సూర్యారావు, కన్వీనర్ శ్రీ చందు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీ సత్యశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

వ్యాఖ్యలు లేవు:

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి