30, జనవరి 2021, శనివారం

పవన్ కళ్యాణ్: కాపులు బలపడకూడదనే తూర్పు కాపు.. మున్నూరు కాపు అని విడదీశారు... కాపుల మధ్య తగాదాలుపెట్టారుదశాబ్దాలుగా  కాపు కులాన్ని విభజించి పాలిస్తున్నారు 
కాపు కులాన్ని ఓటు బ్యాంకుగానే చూస్తున్నారు 
రాజకీయ సాధికారత సాధించడం అవసరం
అధికారం ఎవరూ పిలిచి ఇవ్వరు... చేజిక్కించుకోవాలి   
ప్రతి కులంవారు తమ సమస్యలు నాకు తెలియచేస్తారు... అలాంటిది నేను పుట్టిన కులంవారు తమ సమస్యలు నాకు చెపితే తప్పేముంది?
కులం అంటగట్టేస్తారు అనే భయం లేదు 
నేను కులానికి... మతానికీ అతీతంగా అందరివాణ్ణి
కాపు సంక్షేమ సేన ప్రతినిధులతో సమావేశంలో జనసేన అధ్యక్షులు  వన్ కల్యాణ్ 

కాపులతోపాటు ఆర్థికంగా, సామాజకంగా అణగారిన అన్ని వర్గాలు యాచించే స్థాయి నుంచి శాసించే స్థాయికి ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఆకాంక్షించారు. 1930 నుంచే కాపు కులంలో విభజించు, పాలించు సిద్ధాంతం మొదలయ్యిదని, అది ఈ రోజుకీ కొనసాగుతుందన్నారు. కాపులకు రాజకీయ సాధికారిత వచ్చిన రోజు... మిగిలిన అన్ని వెనుకబడిన కులాలకు విముక్తి లభిస్తుందని చెప్పారు. బీసీ కులాలకు ఇబ్బంది లేకుండా కాపుల న్యాయమైన డిమాండ్లను జనసేన పార్టీ బలంగా ముందుకు తీసుకెళ్తుందన్నారు.  

కాపులు ఎదుర్కొంటున్న సమస్యలు, కాపు రిజర్వేషన్ అంశాలపై కాపు సంక్షేమ సేన ప్రతినిధులు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని మంగళగిరి పార్టీ కార్యాలయంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. కాపు సంక్షేమ సేన అధ్యక్షులు శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారు నేతృత్వంలోని బృందంతో సమావేశమయ్యారు.  అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుత “కులం అనేది మనం ఎంచుకునేది కాదు. మన ప్రమేయం లేకుండా మనం పుట్టింది. తూర్పుగోదావరి జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు రెల్లి కులంవారి అవస్థలు చూసి అట్టడుగు వర్గాల వారికి అండగా ఉండాలని రెల్లి కులాన్ని స్వీకరించాను. పొలిటికల్, సోషల్ ఫిలాసఫీని సంపూర్ణంగా అధ్యయనం చేసి రాజకీయాల్లోకి వచ్చాను. ఏదైనా మాట మాట్లాడితే కులం అంటగట్టేస్తారనే భయం నాకు లేదు.  ప్రతి కులం ప్రతినిధులు నా దగ్గరకు వచ్చి వారి సమస్యలు చెప్పుకొన్నప్పుడు.. నేను పుట్టిన కులం నా దగ్గరకు వచ్చి సమస్యలను విన్నవించుకోవడం తప్పేమి కాదు. దానికి కులం అంటగడతారనే భయం అవసరం లేదు. నా మనసు, ఆలోచన ప్రజలకు తెలుసు. నేను అన్ని కులాలు, మతాలు, ప్రాంతాలకు చెందివాడిని. ప్రతి కులంలో వెనకబాటు తనం గురించి మాట్లాడటానికి ఏ మాత్రం సంకోచించను. 

దామోదరం సంజీవయ్య గారిని గుర్తుంచుకోవాలి 

1891 సంవత్సరంలో బ్రిటీష్ ప్రభుత్వం కులాల ఆధారంగా జనాభా లెక్కలు మొదలు పెట్టడంతో ఈ రిజర్వేషన్ల ప్రక్రియ మొదలయ్యింది. రాజ్యాంగం ఏర్పడి, మద్రాసు రాష్ట్రం నుంచి విడిపోయే వరకు కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాలు బీసీల్లోనే ఉండేవి. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడిన తర్వాత తొలి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన శ్రీ నీలం సంజీవరెడ్డి  కులాలను బీసీ జాబితా నుంచి తప్పించారు. తర్వాత శ్రీ దామోదరం సంజీవయ్య గారు  రిజర్వేషన్లు పునరుద్దరించారు. కాపులు దళితవర్గం నుంచి వచ్చిన గొప్ప నేత, ముఖ్యమంత్రిగా చేసిన శ్రీ దామోదరం సంజీవయ్య గారిని గుర్తుంచుకోవాలి. ఆ తరవాత  కొన్ని రాజకీయ శక్తుల కుయుక్తుల వల్ల బీసీ రిజర్వేషన్ కొనసాగలేదు.  ఈ సమయంలోనే కాపు కులంలో విభజించు, పాలించు అనే సిద్ధాంతం మొదలైంది. అది ఈ రోజుకి కొనసాగుతూనే ఉంది.  తూర్పు కాపులు,  మున్నూరు కాపులు అని విడదీశారు. ఇప్పటికీ విడదీస్తూనే ఉన్నారు. కాపు రిజర్వేషన్ అంశాన్ని ఎవరూ ఇప్పటి వరకు ముందుకు తీసుకెళ్లలేకపోయారు. 

చంద్రబాబు గారు కాపులు ఓసీలా, బీసీలా అనే మీమాంశలో పడేస్తే.. జగన్ రెడ్డి గారు కాపులకు రిజర్వేషన్ ఇవ్వడం కుదరదని చెప్పేశారు. ముందుగా కాపుల్లో చలనం వచ్చి, మథనం జరిగితే తప్ప రిజర్వేషన్ అంశాన్ని ముందుకు తీసుకెళ్లలేము.

అట్టడుగు వర్గాలను నలిపేస్తున్నారు

నాకు స్ఫూర్తినిచ్చిన వ్యక్తుల్లో రామ్ మనోహర్ లోహియా గారు ఒకరు. ఆయన్ను అపారంగా గౌరవిస్తాను. ఆయన రాసిన భారతదేశంలో కులాలు అనే పుస్తకం నన్ను బలంగా హత్తుకుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కులాలకు   వెనకబాటుతనం, కాపుల గురించి ఆయన ప్రస్తవించిన విధానం, మిగతా కులాలను కలుపుకొని ఎలా ముందుకు వెళ్లాలని ఆయన చెప్పిన విధానం నన్ను లోతుగా అధ్యయనం చేసేలా చేసింది. 

రాజకీయంగా శాసించే శక్తులు, చట్టాలను చేతుల్లోకి తీసుకున్న కొంతమంది వ్యక్తులు అట్టడుగు వర్గాలను నలిపేస్తున్నారు. కాపులకు సాధికారిత వచ్చిన రోజున దళితులు, బీసీలు మిగత వెనుకబడిన కులాలకు వీళ్లందరి నుంచి విముక్తి లభిస్తుందని లోహియా గారు ఆ పుస్తకంలో రాశారు. 

కాపుల్లో 80 శాతం మంది దుర్భర స్థితిలో ఉన్నారు 

తెలంగాణ రాష్ట్రంలో ఈడబ్ల్యూఎస్ ను అమలు చేస్తుంటే ఇక్కడ మాత్రం తీసేశారు. చిరంజీవి, పవన్ కళ్యాణ్, హరిరామ జోగయ్య వంటి కొంతమంది వ్యక్తులను చూసి ఆ కులానికి రిజర్వేషన్ అవసరం లేదనుకున్నారేమో? కాపు కులంలో 15 నుంచి 20 శాతం మందిని పక్కన పెడితే 80 శాతం మంది దుర్భర పరిస్థితుల్లో బతుకుతున్నారు. కాపులు బలపడకూడదని తూర్పు కాపులుగా, తెలంగాణలో మున్నూరు కాపులుగా కొన్ని దశాబ్దాల కిందటే విడదీశారు. కాపు, ఒంటరి, బలిజ కులాల మధ్య తగదాలు పెట్టారు. 

రాజకీయ శక్తులు నిరంతరంగా  చేస్తున్న దాడులను అందరూ గుర్తించాలి.  బలమైన ఐక్యత తీసుకొచ్చే ప్రక్రియ జరగాలి. ఏడు దశాబ్దాల నుంచి పోరాటం చేస్తున్న ఎందుకు వెనకబడిపోయామో కాపుల్లో ఆత్మపరిశీలన జరగాలి. రాజ్యాధికారాన్ని చేజిక్కుంచుకునే బలమైన సముహం ఉండి కూడా రాజ్యాధికారాన్ని శాసించే కొన్ని శక్తులకు ముడిసరకుగా ఉపయోగపడుతున్నాం. 

సంఘీభావం తెలిపిన వారిపై కేసులు అలానే ఉన్నాయి 

అధికారం అనేది ఎవరూ మనకి పిలిచి ఇవ్వరూ. మనమే దానిని చేజిక్కుంచుకునే స్థితిలో ఉండాలి. టీటీడీ బోర్డులో కాపులకు స్థానం ఇవ్వలేదని హరిరామ జోగయ్య గారు తెలిపారు. హక్కుల కోసం పోరాటం చేసేటప్పుడు క్రమ పద్ధతిలో విధివిధానాలు ఉండాలి. తుని అంటే అందరికి రైలు దుర్ఘటనే గుర్తొస్తుంది. ఆ దుర్ఘటన వల్ల కాపుల సహేతుకమైన డిమాండ్ మరుగునపడిపోయింది. భవిష్యత్తులో అలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి. తుని రైలు దుర్ఘటనలో నమోదైన కేసులను జగన్ రెడ్డి గారి ప్రభుత్వం కొట్టేసింది. అయితే తుని ఘటనకు సంఘీభావంగా వివిధ జిల్లాల్లో నిరసన తెలిపిన వారిపై ఇంకా కేసులు నడుస్తునే ఉన్నాయి. వాటిని కూడా ఎత్తేయాలి. 

భారతదేశంలో కులాలను పక్కన పెట్టి రాజకీయం చేయలేము. కులాలను అర్ధం చేసుకొనే రాజకీయం చేయాలి. ఒక కులాన్ని భూజం మీద పెట్టుకొని ఊరేగే పరిస్థితి లేకుండా... ఆర్థికంగా, సామాజికంగా వెనకబడిన కులాలను గుర్తించి వారిని అన్ని కులాలతో సమతుల్యం ఏర్పడేలా చేయాలి. కాపులు బలపేతం అవ్వడం అంటే బీసీలను బలహీనులను చేయడం కాదు. వారికి రావాల్సిన హక్కులను తిరిగి తెచ్చుకోవడం. కాపుల వెనుకబాటు తనం, అసంతృప్తిని మనస్ఫూర్తిగా అర్ధం చేసుకున్నవాడిగా చెబుతున్నాను... బీసీలకు ఇబ్బంది లేకుండా కాపుల న్యాయమైన డిమాండ్లను బలంగా ముందుకు తీసుకెళ్తాన”ని హామీ ఇచ్చారు.

చిరంజీవి గారు జనసేనలోకి వస్తున్నారా అని విలేకర్లు ప్రశ్నించగా శ్రీ పవన్ కల్యాణ్ గారు సమాధానమిస్తూ “అన్నయ్యగా  చిరంజీవి గారు తమ్ముడు అభివృద్ధిని కోరుకొంటారు. అన్నయ్య గారి ఆశీస్సులు ఉంటాయి. పార్టీలోకి వస్తారా అనేది ఇప్పుడే చెప్పలేను” అన్నారు.  

కాపు ముద్ర వేయడం ఇష్టంలేకే ఇన్నాళ్లు జనసేనను సంప్రదించలేదు: హరి రామ జోగయ్య 

కాపు సంక్షేమ సేన జాయింట్ యాక్షన్ కమిటీ అధ్యక్షులు, మాజీ మంత్రి శ్రీ చేగొండి హరిరామ జోగయ్య గారు మాట్లాడుతూ “కాపు సంక్షేమ సేన ఏ పార్టీకి సంబంధించిన సంస్థ కాదు. మేము ఏ నాయకుడికీ అనుయాయులం కాదు. కాపుల అభ్యున్నతి కోసం, ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న డిమాండ్ల పరిష్కారం కోసం కాపు సంక్షేమ సేన ఏర్పాటు చేశాం. మా డిమాండ్లను ప్రభుత్వం ముందు ఉంచాం. ముఖ్యమంత్రి గారికీ, అన్ని రాజకీయ పార్టీలకు లేఖలు రాశాం. కేవలం ఒక్క జనసేన పార్టీకి మాత్రమే కుల ముద్ర ఎక్కడ పడుతుందోనన్న భయంతో ఇన్నాళ్లు దూరంగా ఉన్నాం. శ్రీ పవన్ కల్యాణ్ గారు కలగచేసుకుంటేనేగానీ డిమాండ్స్ సాధించలేమన్న నిర్ణయానికి వచ్చాం. కాపు ముద్ర పడినా పర్వాలేదు మాకు న్యాయం జరిగితే చాలు అన్న ఉద్దేశంతో మా సమస్యలు మీ దృష్టికి తీసుకువచ్చాం. మా డిమాండ్లు పరిశీలించి కాపులకు న్యాయం చేయమని ప్రభుత్వానికి సిఫార్సు చేయాలని కోరుతున్నాం. 

ఒక పేద కులం, అన్ని రకాలుగా వెనుకబడి ఉన్న కులం కోరికగా ప్రభుత్వం ముందు ఉంచండి. మేము ఇతర కులాల ప్రయోజనాలు కాపాడుతూ మాకు డిమాండ్లు పరిష్కారం అయ్యేలా చూడండి. మేము ఏ ఒక్క కులానికీ వ్యతిరేకం కాదు.

రాజకీయంగా సైతం కాపులను అణగదొక్కుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డులో కనీసం ఒక్క కాపుకి కూడా అవకాశం ఇవ్వకపోవడమే అందుకు నిదర్శనం. కాపుల్ని కేవలం రాజకీయ లబ్ది కోసం ఉపయోగించుకోవడం మినహా ఎవ్వరూ మాకు ఉపయోగపడలేదు” అన్నారు. ఈ సమావేశంలో కాపు సంక్షేమ సేన గౌరవ అధ్యక్షులు డా.యిర్రింకి సూర్యారావు, కన్వీనర్ శ్రీ చందు శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి శ్రీ సత్యశేఖర్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

ఎన్‌ఆర్‌ఐ జనసేన టీమ్‌కు పవన్ కళ్యాణ్ అభినందనలు

 

ఎన్నారై జనసేన టీం కార్యక్రమాలను జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి వివరిస్తున్న పార్టీ కోశాధికారి ఎ.వి.రత్నం

న్.ఆర్.ఐ. జనసేన టీమ్ క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలకు అండగా నిలవడం  అభినందనీయంగా ఉందని పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు చెప్పారు. గురువారం ఉదయం హైదరాబాద్ లో పార్టీ చేపడుతున్న కార్యక్రమాలకు ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్ అందిస్తున్న సహకారంపై చర్చించారు. డొక్కా సీతమ్మ ఆహార శిబిరాల నిర్వహణ, కోవిడ్ పరిస్థితుల్లో చేపట్టిన సేవా కార్యక్రమాలు, ఆక్సిజన్ సిలెండర్ల వితరణ... ఇలా పలు కార్యక్రమాల్లో ఎన్.ఆర్.ఐ. జనసేన టీమ్ స్పందించి తమ వంతు తోడ్పాటునిచ్చింది. జనసేన పార్టీ కోశాధికారి శ్రీ ఎ.వి.రత్నం గారు ఇందుకు సంబంధించిన వివరాలను పార్టీ అధ్యక్షులకు తెలియచేస్తూ, ప్రకాశం జిల్లాలో అధికారపక్షం వేధింపులవల్ల ఆత్మహత్య చేసుకున్న జనసైనికుడు శ్రీ వెంగయ్య నాయుడు కుటుంబానికీ ఎన్నారై జనసేన టీమ్ అందించిన సహాయాన్ని వివరించారు. ఇందుకు పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కల్యాణ్ గారు ఎన్నారై జనసేన టీమ్ కు అభినందనలు తెలియచేశారు.


21, జనవరి 2021, గురువారం

పవన్ కళ్యాణ్ తిరుపతి పర్యటన ఫొటోలు

 


తిరుపతి చేరుకున్న జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. గురువారం అక్కడ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశం నిర్వహిస్తున్నారు.

తిరుపతి విమానాశ్రయంలో, తిరుపతి నగరంలో పవన్ కళ్యాణ్‌కు స్థానిక కార్యకర్తలు, ప్రజలు బ్రహ్మరథం పట్టారు. ఆ చిత్రాలు..

18, జనవరి 2021, సోమవారం

గిద్దలూరు ఎమ్మెల్యేను ప్రశ్నించిన జనసేన కార్యకర్త బండ్ల వెంగయ్య నాయుడు ఆత్మహత్య


మ గ్రామంలో పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉంది... రహదారి లేదు... ఇతర సౌకర్యాల కల్పన ఏమైంది అని ఎమ్మెల్యేను ప్రశ్నించినందుకు ఈ రోజు బండ్ల వెంగయ్య నాయుడు ప్రాణాలు తీసుకొనే పరిస్థితి రావడం అత్యంత దురదృష్టకరం అని జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ అన్నారు. 

‘‘ప్రకాశం జిల్లా గిద్దలూరు నియోజకవర్గంలోని సింగరపల్లి గ్రామంలో స్థానిక ఎమ్మెల్యే అన్నా రాంబాబుని కోనపల్లిలో పారిశుధ్యపరమైన ఇబ్బందులు ఉన్నాయి, రహదారులు లేవు... ఇతర ఏ సౌకర్యాలు లేవని... ఎప్పుడు కల్పిస్తారని  జనసేన కార్యకర్త వెంగయ్య నాయుడు ప్రశ్నించారు. అందుకు సమాధానం ఇవ్వలేని స్థితిలో ఎమ్మెల్యే రాంబాబు - 'నీ మెడలో పార్టీ కండువా తీయ్...' అని మొదలుపెట్టి సభ్యసమాజం పలకలేని భాషలో మాట్లాడటం సామాజిక మాధ్యమాల్లో, మీడియాలో రాష్ట్ర ప్రజలు చూశారు. ప్రశ్నించిన ఆ యువకుణ్ణి  ప్రజల మధ్యనే  బెదిరించిన ఎమ్మెల్యే- తదుపరి తన పార్టీ వ్యక్తుల ద్వారా బెదిరించడం, వివిధ రూపాల్లో ఒత్తిళ్లకు గురి చేసినట్లు మాకు సమాచారం అందింది. ఈ రోజు  శ్రీ వెంగయ్య నాయుడు ఆత్మహత్య చేసుకొన్నారని తెలిసి బాధకు లోనయ్యాను. ఆయన కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి. శ్రీ వెంగయ్య నాయుడు కుటుంబానికి పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది.

* ఎమ్మెల్యే, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి

తమ గ్రామంలో సౌకర్యాల కోసం ప్రజల తరఫున గళమెత్తి ఎమ్మెల్యేను ప్రశ్నించడమే శ్రీ వెంగయ్య నాయుడు చేసిన తప్పా?  అతను తన ఒక్కడి సౌకర్యం కోసం ప్రశ్నించలేదు... ఊళ్ళో ప్రజలందరి కోసం మాట్లాడాడు. ఆ గొంతు అధికార పార్టీ ఎమ్మెల్యేకు ఎందుకు భయం పుట్టించింది. ఆ భయంతోనే శ్రీ వెంగయ్య నాయుడు గొంతు నొక్కే పని ఆ క్షణం నుంచే అధికార పక్షం మొదలుపెట్టింది. బాధ్యత కలిగిన ఎమ్మెల్యే వ్యవహార శైలి అభ్యంతరకరంగా ఉంది. గ్రామంలో కనీస సౌకర్యాల గురించి అడిగినందుకు ప్రాణాలు కోల్పోవలసిందేనా? ఇది వైసీపీ నిరంకుశ పాలనకు నిదర్శనంగా నిలుస్తుంది. తన నియోజకవర్గ ప్రజలకు కనీస సదుపాయాలు కూడా కల్పించలేనప్పుడు ఆ పదవిలో  ఉండి ఏమి ఉపయోగమో సదరు ఎమ్మెల్యే ఆత్మ పరిశీలన చేసుకోవాలి. శ్రీ వెంగయ్య నాయుడు మృతిపై సమగ్ర విచారణ చేయించాలి. అధికార పక్షం ఈ ఆత్మహత్యకు బాధ్యత వహించాలి. అతన్ని బెదిరింపులకు గురి చేసి, ఆత్మహత్యకు ప్రేరేపించిన ఎమ్మెల్యే రాంబాబు, ఆయన అనుచరులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి’’ అని పవన్ కళ్యాణ్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.

15, జనవరి 2021, శుక్రవారం

గోశాలలో కనుమ వేడుకలు నిర్వహించిన పవన్ కల్యాణ్

 

పవన్ కళ్యాణ్

న జీవనయానంలో తోడుగా ఉన్న పశుపక్ష్యాదులను సైతం పూజించడం హిందూ ధర్మంలో కనిపిస్తుంది. కనుమ పండుగ రోజున మన పాడి పంటలకు దోహదపడ్డ పశు సంపదను ఆరాధిస్తాం. జనసేన అధ్యక్షులు పవన్ కల్యాణ్ కనుమ వేడుకలను గోశాలలో సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. హైదరాబాద్ లోని తన వ్యవసాయ క్షేత్రంలో ఉన్న గోశాలలో కనుమకు సంబంధించిన పూజలను చేపట్టారు. గోవులను అలంకరించి వాటికి ఫలాలు, ఇతర ఆహారం అందించి నమస్కరించారు. గోమాతను పూజించడం, సంరక్షించడం మన సంస్కృతిలో భాగం అని పవన్ కల్యాణ్ విశ్వసిస్తారు. ఆ క్రమంలోనే గోశాలలోని గో సంపదతోపాటు, వ్యవసాయ క్షేత్రంలోని ఇతర పశు సంపద, అక్కడకు చేరే పక్షుల సంరక్షణకు అవసరమైన ఏర్పాట్లపై  సిబ్బందికి దిశా నిర్దేశం చేశారు.
11, జనవరి 2021, సోమవారం

పవన్ కళ్యాణ్: దివిస్ బాధితుల కన్నీళ్లు తుడవమంటే మంత్రి గౌతం రెడ్డి కథలు చెబుతున్నారు

 

పవన్ కళ్యాణ్


• 75శాతం ఉద్యోగాలు గురించి ఇప్పుడే ఎందుకు మాట్లాడుతున్నారు ?

రివర్స్ టెండరింగ్ తరహాలోనే దివిస్ పరిశ్రమపై నిర్ణయం తీసుకోవచ్చుగా

• 36మంది స్థానికులను విడుదల చేయమని మీరు చెబుతున్నా

   ఎవరూ మీ మాట పట్టించుకోవడం లేదు

దివిస్ లాబోరేటరీస్ బాధితుల కన్నీళ్లు తుడవమని అడుగుతుంటే పంచాయితీ ఎన్నికలు నిర్వహించడంపై మాట్లాడమని ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖా మంత్రి మేకపాటి గౌతం రెడ్డి అడుగుతున్నారంటే ఆయన విజ్ఞతపై సందేహాలు కలుగుతున్నాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. 

‘‘ఆయన చెబుతున్న మాటలు సమస్యను ఏమార్చేదిగా బోడిగుండుకీ బొటన వేలుకీ ముడిపెట్టినట్టు ఉంది. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకల గ్రామంలో ఏర్పాటవుతున్న దివిస్ లాబొరేటరీస్ కర్మాగారం కారణంగా అక్కడి 15 గ్రామాలకు చెందిన వేలాది మంది ప్రజలు చేస్తున్న ఆక్రందనలు మీ చెవులకు సోకడం లేదా గౌతంరెడ్డి గారు? ఆ కర్మాగారానికి అనుమతులు ఇచ్చింది చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అని మీరు తప్పించుకోవడానికి ప్రయత్నించడం ఎంత వరకు సబబో మరోసారి ఆలోచించండి.

చంద్రబాబు ప్రభుత్వం అనుమతులు ఇస్తే మీరు ఆపరా? ఆపలేరా? ఆయన ప్రారంభించిన అన్నిటినీ ఒక్కొక్కటిగా రద్దు చేశారు కదా.. రాజధాని అమరావతిని ఆపారు. పోలవరం ప్రాజెక్టును రివర్స్ లో తీసుకువెళ్తున్నారు. మరి అదే విధంగా దివిస్ కర్మాగారంపై అక్కడి ప్రజల మనోభావాలకు అనుగుణంగా చర్యలు తీసుకొని.. ఆ పరిశ్రమపై ఓ నిర్ణయం తీసుకోవచ్చుగా. కనీసం అరెస్టు చేసిన 36 మందిని సైతం విడిచిపెట్టలేరా? 36మంది సూటు కేసు కంపెనీలు పెట్టి మోసాలు చేశారా? లేదా ప్రాజెక్టులకు అనుమతులు ఇచ్చి నీకింత... నాకింత అని కిక్ బ్యాక్స్ తీసుకున్నారా? లేదా ప్రత్యర్ధులను పథకం ప్రకారం హతమార్చారా? కేవలం ఫ్యాక్టరీ వద్దన్నందుకు అమాయకులను అరెస్టులు చేసి జైళ్లలో పెడతారా? వారి కుటుంబాల శోకం మీ ప్రభుత్వానికి తప్పక తగులుతుంది. ఆ 36మందిని విడిచిపెట్టమని మీరు రివ్యూల్లో చెబుతున్నారని వార్తల్లో చదివాం. ఆ అమాయకులు మాత్రం ఇంకా జైల్లోనే ఉన్నారు. అంటే మీ మాటను ఎవరూ పట్టించుకోవడం లేదు అని అర్థం చేసుకోవాలా?

 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ఏడాదిన్నర క్రితమే మీ ప్రభుత్వం ప్రకటించిందని మీరు మీ ప్రకటనలో పేర్కొన్నారు. అటువంటప్పుడు మీరు మళ్లీ నాలుగు రోజుల కిందట నుంచే ఆ విషయాన్ని ఎందుకు చెబుతున్నారు. నిజంగా ఏడాదిన్నర కిందటే మీ ప్రభుత్వం 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అని నిర్ణయం తీసుకుంటే ఆ విధంగా ఎంత మందికి ఉద్యోగాలు వచ్చాయో గౌరవనీయ మంత్రిగారు చెప్పగలరా? మీ ప్రభుత్వం నిర్వాకం కారణంగా ఏషియన్ పల్ప్ అండ్ పేపర్ కంపెనీ వెనక్కి వెళ్లిపోవడాన్ని కాదనగలరా? ఎలక్ట్రిక్ బస్సుల తయారీ యూనిట్ ను ఏర్పాటు చేసిన అశోక్ లేల్యాండ్ కంపెనీ ఉత్పత్తిని ప్రారంభించకపోవడానికి కారణం వివరించగలరా? కార్ల తయారీ కంపెనీ కియాకు సంబంధించిన ప్రతినిధులను మీ నేతలు ఎన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారో మీకు తెలిసిందేగా! ఇలా చెప్పుకొంటూపోతే ఎన్నో ఉన్నాయి.

దివిస్ ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేసింది ఎవరు? మీ పార్టీ నాయకుడు, మీ పార్టీ వారు కాదా? ఎన్నికల ముందు మీరు పలికిన ప్రగల్భాల గురించి తొండంగి మండలంలోని రాళ్లు రప్పలు కూడా చెబుతాయి. ఎన్నికలకు ముందు ఆ ప్రాంతానికి వెళ్ళిన మీ నాయకుడు జగన్ రెడ్డి గారు తాను అధికారంలోకి వస్తే దివిస్ ను బంగళా ఖాతంలో కలిపేస్తాను అని స్థానికులను రెచ్చగొట్టినందువల్లే కదా.. ఇప్పుడు ఆ అమాయక ప్రజలు దివిస్ పరిశ్రమకు వ్యతిరేకంగా రోడ్ల పైకి వస్తోంది. 151 స్థానాలను ప్రజలు మీకు అప్పగించింది తప్పుఒప్పులను సరిచేసి సమన్యాయం అందించమనే కదా? మరి మీరిప్పుడు ఏం చేస్తున్నారు? ఆ తప్పుల నుంచి ప్రయోజనాలు పొందడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు. ముందుగా 36 మందిని బేషరతుగా విడుదల చేసి అక్కడ ప్రజలు ఏం కోరుతున్నారో అది చేయడానికి ప్రయత్నించండి.

నేను 10వ తరగతి నెల్లూరులో చదివిన విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసినందుకు సంతోషం. యూకేలో ఎమ్.ఎస్. చదివిన మీరు ఆ 36 మంది బాధితులను విడుదల చేయించి ఆ విషయం కూడా ప్రపంచానికి తెలియజేయండి. సంతోషిస్తాం’’ అని పవన్ అన్నారు.

9, జనవరి 2021, శనివారం

పవన్ కళ్యాణ్: దివిస్ ఆపేది లేదు... ఎవరు అడ్డొస్తారో చూస్తాం అని జగన్ ఛాలెంజ్ చేస్తారా?.. లేదంటే ఇచ్చిన మాట నిలబెట్టుకుంటారా* అప్పుడు బంగాళాఖాతంలో కలిపేస్తా అన్నారు... ఇప్పుడు అనుమతినిచ్చారు
* ఇదేం రాజకీయం – ఇవేం విలువలు
* జగన్ రెడ్డిని ప్రశ్నించిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ 
* అక్రమంగా అరెస్టు చేసినవారిని బేషరతుగా విడుదల చేయాలి
* దివిస్ వల్ల కాలుష్యం ఉండదని శాస్త్రీయంగా నిరూపించండి
* పిల్లికి ఎలుక సాక్ష్యం లాంటి నివేదిక చూపిస్తున్నారు
* కొత్తపాకల బహిరంగ సభలో జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు 


పాదయాత్ర సమయంలో దివిస్ పరిశ్రమను బంగాళాఖాతంలో కలిపేస్తాం అని చెప్పి... అధికారంలోకి రాగానే పరిశ్రమ నిర్మాణానికి అనుమతులు ఇవ్వడం ఏం విలువలతో కూడిన రాజకీయమో ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారే చెప్పాలని జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించారు. కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను ఈ ప్రాంతంలో రానివ్వమని జగన్ రెడ్డి గారు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు. కాదుకూడదు పరిశ్రమను ఏర్పాటు చేస్తాం, ఎవరడ్డొస్తారో చూస్తామని ముఖ్యమంత్రి ఛాలెంజ్ చేస్తారా.. అలా చెబితే ఎలా ఎదుర్కోవాలో మాకు బాగా తెలుసని అన్నారు. మరోసారి ఈ ప్రాంతానికి వస్తాను అన్నారు. తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలలో దివీస్ ఫార్మా పరిశ్రమ ఏర్పాటుకు వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న వారికి మద్ధతుగా శనివారం సాయంత్రం భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ గారు ప్రసంగిస్తూ... “ఎన్నో ఏళ్లు మధించి, దేశ నాయకులను స్ఫూర్తిగా తీసుకొని, వర్తమాన కాల పరిస్థితులను అర్ధం చేసుకొని పర్యావరణాన్ని పరిరక్షించే అభివృద్ధి ప్రస్థానం అనే సిద్ధాంతాన్ని జనసేన పార్టీ మూల సిద్ధాంతాల్లో పెట్టాం. రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందాలని కోరుకునే వ్యక్తిని నేను. తూర్పు గోదావరి జిల్లాలో సుమారు 50 లక్షల మంది వరకు జనాభా ఉంది. ఈ ప్రాంతంలో చాలా పరిశ్రమలు రావాలని కోరుకుంటాం. పర్యావరణానికి కొంత ఇబ్బంది కలుగుతుంది. అయితే అది ఏ స్థాయిలో అన్నదే మనం ఇక్కడ ప్రశ్నించుకోవాలి. 

* ఆస్తులు ఇవ్వొచ్చు ఆరోగ్యాన్ని వారసత్వంగా ఇవ్వలేం 

మన బిడ్డలకు వారసత్వంగా ఆస్తులు, పొలాలు, బంగారం ఇవ్వగలం. కానీ ఆరోగ్యాన్ని ఆస్తిగా ఇవ్వలేం. పీల్చే గాలి, తాగే నీరు కలుషితమై అనారోగ్యానికి గురైతే... మనం ఎన్ని ఆస్తులు ఇచ్చినా వాళ్లు అనుభవించలేరు. ఈ భూమి ఎవరి సొంతం కాదు. సగటు మనిషి జీవిత కాలం 64 ఏళ్లు. ఈ 64 ఏళ్లు ఈ భూమి మీద సక్రమంగా జీవించి, భావితరాలకు పదిలంగా అప్పగించాలి. వేల కోట్లు, వందల ఎకరాలు, ఖరీదైన ప్రాంతంలో ఇళ్లు కట్టి పిల్లలకు ఇస్తే వారి భవిష్యత్తు బాగుంటుందని వైసీపీ నాయకులు అనుకుంటే పొరపాటే. విశాఖపట్నంలో స్టరీన్ గ్యాస్ లీక్ అయినపుడు డబ్బున్నవాడి మీద, పేదవాడి మీద ఒకేలా పనిచేసిందని గుర్తుంచుకోవాలి. ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు, వైసీపీ ప్రజాప్రతినిధులు నాకు శత్రువులు కాదు. విధానాలు సరిగా లేనప్పుడు కచ్చితంగా బయటకు వచ్చి ప్రశ్నిస్తాం.

* ఆ మాత్రం స్పృహ మంత్రులకు లేదు 

వాయు, జల కాలుష్యాలు ఎంత ప్రమాదకరమో ఏలూరు దుర్ఘటన ద్వారా అందరికీ అవగతమైంది.  ఎంతో మంది పిల్లలు, పెద్దవారు ఆస్పత్రిలో చికిత్స పొందాల్సి రావడం చూశాం. ఈ రోజుకీ రాష్ట్ర ప్రభుత్వం ప్రజలు ఎందుకు అస్వస్థతకు గురయ్యారో గుర్తించలేక పోయింది. రాత్ గయే... బాత్ గయే అని వదిలేశారు. జనసేన మాత్రం అలా వదిలేయదు.  ఈ ప్రాంతంలో దివీస్ పరిశ్రమ ఏర్పాటు అయితే అది రోజుకు 65 లక్షల లీటర్ల మంచినీటిని వినియోగించి 55 లక్షల లీటర్ల నీటిని కలుషితం చేసి సముద్రంలో కలుపుతుంది. తుని పట్టణ అవసరాలకు రోజుకు 45 లక్షల లీటర్ల నీరు అవసరమవుతాయి. అంటే దీనికంటే 10 లక్షల లీటర్ల నీటిని దివీస్ ఫార్మా కలుషితం చేస్తుందన్న మాట. జల కాలుష్యం కంటికి కనిపించడం లేదని నిర్లక్ష్యం చేస్తే వాయు కాలుష్యంలానే ప్రాణం తీస్తుంది. సముద్రంలో జలచరాలను చంపేస్తుంది. మత్స్యకారులు ఉపాధి కోల్పోతారు. సముద్రంలో మత్స్య సంపద పెరగాలని వేట నిషేధ సమయంలో కడుపుకాల్చుకొని మరీ ఉంటారు మత్స్యకారులు. ప్రకృతిని అర్థం చేసుకొని జీవనం సాగిస్తారు. వాళ్లకు ఉన్న పర్యావరణ స్పృహ కూడా మన ప్రజాప్రతినిధులకు, మంత్రులకు లేకుండా పోయింది. లోక జ్ఞానం అంటే డిగ్రీలు, పీజీలు, అవార్డులు తీసుకుంటే వచ్చేది కాదు. ప్రకృతిని అర్ధం చేసుకుంటే వచ్చేది.

ఆకాశానికి రాకెట్లు పంపిస్తున్నాం. మార్సులో అడుగు పెట్టాలని చూస్తున్నాం. భారతదేశం నుంచి సున్నాను ఇచ్చామని, ఖగోళ శాస్ర్తం గురించి ముందే తెలుసని గొప్పగా చెప్పుకుంటున్నాం. కానీ రసాయన వ్యర్థాలను వంద శాతం శుద్ధి చేసే టెక్నాలజీని మాత్రం మన దేశంలో తీసుకురాలేక పోతున్నాం. గొప్ప గొప్ప మేధావులు మన దగ్గర ఉన్నారు. వారి సేవలను వినియోగించుకోలేకపోతున్నాం. పాశ్చత్య దేశాల్లో వ్యర్ధజలాలను శుద్ధి చేసే టెక్నాలజీ ఉంది. భారీ ఖర్చుతో కూడుకున్నది కనుక మన దగ్గర వాడటానికి సిద్ధంగా లేరు. ఇక్కడ రాబోతున్న పరిశ్రమ షేర్ వాల్యూ రూ. 3 వేలకు పైమాటే. ప్రజల కన్నీరుపై తమ ఎదుగుదల ఉండకూడదని ప్రతి పరిశ్రమ గుర్తించాలి. లాభాల వేటలో పడి అన్ని పరిశ్రమలు విలువలను వదిలేస్తున్నాయి.  రసాయన వ్యర్ధాలను సముద్రంలో కలిపేస్తాం, భూమిలో కలిపేస్తాం అంటే జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. కచ్చితంగా వారికి విలువలు నేర్పిస్తాం.

* పర్మిషన్ ఇచ్చేటప్పుడే ఆలోచించుకోవాలి 

ఈ ప్రాంతంలో పరిశ్రమ పెట్టడానికి దివీస్ పరిశ్రమ 489 ఎకరాలు కావాలని ప్రభుత్వాన్ని కోరింది. అందులో 150 ఎకరాల్లో ప్లాంటు ఏర్పాటు చేస్తాం. మిగిలిన 350 ఎకరాలు భవిష్యత్తులో విస్తరణకు అని చెప్పారు. ఇప్పుడు 489 ఎకరాలు కాస్త 690 ఎకరాలు అయ్యింది. పరిశ్రమ రూ. 600 కోట్లు పెట్టుబడి పెడితే ప్రభుత్వం 690 ఎకరాలు కేటాయించింది. పోనీ వేలకొలది ఉద్యోగాలు వస్తాయి అనుకుంటే అది పొరపాటే.  15 వందల శాశ్వత ఉద్యోగాలు, ఇంకో 15 వందలు టెంపరరీ ఉద్యోగాలు. మొత్తం తిప్పికొడితే 3వేల ఉద్యోగాలు కూడా లేవు. కేవలం 15 వందల ఉద్యోగాల కోసం భూమి ఫ్రీగా ఇచ్చి, పెట్టిన పెట్టుబడి కూడా తిరిగి ఇచ్చేటట్లు ఒప్పందాలు చేస్తున్నారు.  ఈ ప్రాంతంలో 200కు పైగా ఉన్న హేచరీస్ పై 45 వేల మంది ఉపాధి పొందుతున్నారు. నెలకు రూ. 20 వేలకు పైగా సంపాదిస్తున్నారు. అలాంటి హేచరీస్ ను ధ్వంసం చేసి ఇలాంటి పరిశ్రమలకు పర్మిషన్ ఇవ్వడం ఎంత వరకు సబబో ప్రభుత్వమే ఆలోచించుకోవాలి.

* ప్రజల ఆరోగ్యంతో ఆటలొద్దు 

పరిశ్రమ కోసం భూములు కావాలంటే ముందు సామాజిక ప్రభావం అంచనా వేయాలి. ఈ ప్రాంతంలో ఏ ఏ కులాలు ఉన్నాయి. ఎలాంటి ఉపాధి పొందుతున్నారు. ఎంత సంపాదిస్తారు. భూములు లాక్కుంటే ఎంత ఇవ్వాలి అని ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్లు లెక్కకడతారు. దివీస్ కంపెనీకి వైసీపీ నాయకులకు చెందిన రాంకీ కంపెనీ వాళ్లే ఈ నివేదిక ఇచ్చారు. ఇది పిల్లికి ఎలుక సాక్ష్యం లాంటిదే ఇలాంటి కంపెనీలు మన దేశంలోనే పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది పర్యావరణ చట్టాలు కఠినంగా లేకపోవడం. 1984లో భోపాల్ గ్యాస్ విధ్వంసం జరిగింది. ముక్కుపచ్చలారని ఎందరో పసిపిల్లలు చనిపోయారు. దాని తర్వాత 1994 వరకు పర్యావరణ చట్టాలు తీసుకు రాలేదు. పర్యావరణ శాఖ ఏం చేస్తుందో, పొల్యూషన్ బోర్డు ఏం చేస్తుందో సమాధానం చెప్పాలి. పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి గారిని మేము ఒకటే అడుగుతున్నాం. ఈ పరిశ్రమ నుంచి ఎలాంటి కాలుష్యం బయటకు రాదని సైంటిఫిక్ గా నిరూపిస్తే పరిశ్రమ ఏర్పాటుకు జనసేన అడ్డురాదు. అలాగే సర్టిఫికేట్లు ఇచ్చిన రాంకీ ఎన్విరాన్ మెంట్ ఇంజనీర్లు గర్భిణులకు గర్భస్రావం కాదని, ఎవరికీ చర్మవాధులు, శ్వాసకోశ వ్యాధులు రావని సైంటిఫిక్ గా నిరూపించే బాధ్యత తీసుకోవాలి. పరిశ్రమల్లో వాటాలు పెట్టుకొని వాటికి పర్మిషన్లు ఇచ్చి ప్రజారోగ్యంతో చెలగాటం ఆడాలని చూస్తే మాత్రం జనసేన దానికి వ్యతిరేకం.

 * కోడి కత్తితో పొడిచిన వాళ్ళు... పొడిపించుకున్న వాళ్ళు బాగానే ఉన్నారు 

తమ పొలాల్లోకి వెళ్లినందుకు 160 మందిపై కేసులు పెట్టారు. 36 మంది ఇప్పటికీ జైల్లో మగ్గిపోతున్నారు. ఈ గ్రామీణులు సూట్ కేసు కంపెనీలు పెట్టి అవినీతికి పాల్పడలేదు. హ్యతలు, దోపిడీలు చేయలేదు. కోడి కత్తితో పొడవలేదు. కోడి కత్తితో పొడిచినోళ్లు, పొడిపించుకున్నోళ్లు బాగానే ఉన్నారు. కానీ భూమి కోసం పోరాటం చేసినోళ్లు మాత్రం జైల్లో మగ్గిపోతున్నారు. గౌతమ్ రెడ్డిగారు పెద్ద మనసు చేసుకొని వారిని బేషరతుగా విడుదల చేయాలి. వైసీపీ నాయకుల్లాగా దిగజారి మాట్లాడటం మనకు రాదు. తల్లిదండ్రులు సంస్కారం నేర్పించారు. మనం గౌరవ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అని పిలిస్తే.. వాళ్లు మనల్ని ఎలా తిడతారో కాకినాడ వైసీపీ ఎమ్మెల్యే మాటలు వింటే తెలుస్తుంది. మనం తిరిగి ఒక మాట అనడానికి ఎంతోసేపు పట్టదు. రోడ్ల మీదకు వచ్చి ఎదురుదాడి చేయలేక కాదు. గొడవలు, దౌర్జన్యాల కోసం రాజకీయాల్లోకి రాలేదు. మార్పు తీసుకురావడానికి రాజకీయాల్లోకి వచ్చాం.

 పోలీసుల మీద కాదు వ్యవస్థల్ని శాసించే వారి మీదే కోపం 

సభకు పర్మిషన్ ఇచ్చే విషయంలో చాలా హైడ్రామా నడిచింది. వారం ముందు పర్మిషన్ ఇచ్చాం అని చెప్పి, నిన్న సాయంత్రం అనుమతులు లేవని చెప్పారు. నాకు పోలీసుల మీద కోపం లేదు. వాళ్ల బాసులు ఏం చెబుతారో వాళ్లు అదే చేస్తారు. నన్ను అమరావతిలో నెట్టేసే పరిస్థితి వచ్చినా నాకు వారి మీద కోపం రాలేదు. నా కోపం వ్యవస్థల్ని శాసించే వ్యక్తుల మీద తప్ప పోలీసుల మీద కాదు. పర్మిషన్ ఇవ్వకపోయినా నడుచుకుంటూ అయినా వస్తాం.  పదవిలోకి వస్తే బంగాళాఖాతంలో కలిసేస్తాం.... పదవిలోకి వచ్చాక పర్మిషన్లు ఇస్తాం అనే మాయ మాటలు జనసేన చెప్పదు. ఒక పరిశ్రమ ఉండాలంటే ఎలాంటి విధానాలు ఉండాలి,  కాలుష్యం ఎంత వెదజల్లుతుంది వంటి వాటిని పరిగణనలోకి తీసుకొని పర్మిషన్ ఇస్తాం.  విధ్వంసం స్థాయి ఎక్కువగా ఉంటే మాత్రం పరిశ్రమ మాకు వద్దు వెళ్లిపోండని  మొహమాటం లేకుండా చెప్పేస్తాం. ఏ పరిశ్రమ అయినా చట్టాలకు లోబడే ఉండాలి. దివీస్ పరిశ్రమపై నాకు ఎలాంటి కోపం లేదు. ప్రజల ఆరోగ్యానికి ఎలాంటి నష్టం కలగదని ఆ పరిశ్రమ నిరూపించుకోవాలని అన్నారు.  ఇప్పటికైనా జగన్ రెడ్డి గారు ఇచ్చిన మాట ప్రకారం పరిశ్రమను ఇక్కడ నుంచి తరలించాలి. లేనిపక్షంలో బాధితుల తరఫున పోరాటం చేయడానికి జనసేన వెనుకాడద"ని జనసేనాని హెచ్చరించారు.

 జగన్ రెడ్డి గారిది రెండు నాల్కల ధోరణి:  నాదెండ్ల మనోహర్ 

ఎన్నికలకు ముందు దివీస్ ఫార్మా ఏర్పాటును తీవ్రంగా వ్యతిరేకించిన శ్రీ జగన్ రెడ్డి గారు తీరా ముఖ్యమంత్రి అయ్యాక ఎందుకు వెనక్కు తగ్గారో ప్రజలు ఒకసారి ఆలోచించాలని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ శ్రీ నాదెండ్ల మనోహర్ గారు కోరారు. ఆనాడు ఓట్ల కోసం మభ్యపెట్టి పదవి వచ్చిన తరువాత మారిపోయిన వ్యక్తి ఈ జగన్ రెడ్డి. ఆ రోజు దివీస్ పై నిప్పులు చెరిగిన వ్యక్తి ఈ రోజు ఇంతగా ఏ కారణాల వల్ల మారిపోయారు? ఈయనేనా ప్రజానేత అంటూ ప్రశ్నించారు. ప్రజాప్రతినిధులంటే నిజాయతీ, నిలకడ ఉండాలి. ఈ ముఖ్యమంత్రికి నిలకడ లేదు. ఉన్నదంతా రెండు నాల్కల ధోరణే. ఆనాటి శ్రీ జగన్ రెడ్డి ప్రసంగాన్ని అవలోకం చేసుకుంటే ఆయన ఉపన్యాసం అభివృద్ధి కోసమా....ఓట్ల కోసమా అనేది ఇట్టే అర్ధమవుతుంది. అభివృద్ధిని అందరం ఆహ్వానించాల్సిందే....కాని పర్యావరణాన్ని ధ్వంసం చేసి కాదు. ఇదే జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు బలంగా నమ్మే సిద్ధాంతం. కాలుష్యం నుంచి కాపాడంటూ ఉద్యమం చేస్తున్న వారిలో 160 మందిపై కేసులు పెట్టారు. ఇంకా 36 మంది జైలులోనే మగ్గుతున్నారు. మహిళలపై లాఠీచార్జీ చేశారు. ఇంత జరుగుతుంటే ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రజాప్రతినిధులు ఎందుకు ముఖం చాటేస్తున్నారు? ఇక్కడ ఈ సభను అడ్డుకోవడానికి ప్రభుత్వం విశ్వప్రయత్నం చేసింది. జిల్లా ఎస్పీపై విపరీతమైన వత్తిడి తెచ్చింది. అయినా అనుమతులిచ్చిన ఎస్పీ గారికి, పోలీసు యంత్రాంగానికి ధన్యవాదాలు. ఆరంభంలో రూ.390 కోట్ల పెట్టుబడితో పరిశ్రమ ప్రారంభిస్తున్నామని 1300 మందికి ఉపాధి కల్పిస్తామని చెప్పిన దివీస్ ఇప్పటి లెక్కలు వేరేగా ఉన్నాయి. రూ.1500 కోట్ల పెట్టుబడి, 6000 మందికి ఉపాధి అంటున్నారు.  75 శాతం ఉద్యోగాలు స్థానికులకే అని కొత్త ప్రచారం మొదలు పెట్టారు. విచిత్రమేమిటంటే ఇక్కడ చదువుకున్న వారి శాతం 12కి మించి లేదు. పైపెచ్చు ఆ పరిశ్రమకు అవసరమైన మెకానికల్ ఇంజినీర్లు, కెమిస్టులు, ఫార్మాసిస్టులు ఇక్కడ ఉన్నారా? ఎందుకీ మభ్య పెట్టే మాటలు? వీటన్నింటిపై పాలకులను నిలదీయాల్సిన బాధ్యత మీతోపాటు మా మీద కూడా ఉంది. అందుకే ఇక్కడకు వచ్చాం. రెచ్చగొట్టడానికో....ఓట్ల కోసమో కాదు. ముఖ్యమంత్రి స్పందించేవరకు ఉద్యమిద్దాం. మీకు న్యాయం జరిగే వరకు జనసేన పార్టీ మీ వెంట నిలబడుతుంద"ని శ్రీ మనోహర్ గారు హామీ ఇచ్చారు. 

 ఇలాంటి అభివృద్ధి మాకొద్దు.... 

అంతకు ముందు పలువురు రైతులు, మత్స్యకారులు, హేచరీస్ వారు మాట్లాడుతూ శ్రీ జగన్ రెడ్డి గారు ఎన్నికలకు ముందు ఇక్కడకు వచ్చి చేసిన ప్రసంగాన్ని నమ్మి ఆ పార్టీకి మెజార్జీ ఇచ్చాం. ఇప్పుడు మడమ తిప్పి మమ్మల్ని ముప్పతిప్పలు పెడుతున్నారు. ఇక్కడ 220 హేచరీలు ఉన్నాయి. దాదాపు 50 వేల మందికి ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి లభిస్తోంది. ఇప్పుడిప్పుడే పిల్లల్ని బాగా చదివించుకోగలుగుతున్నాం. మాకు ఇది చాలు. మా బతుకు మమ్మల్ని బతకనీయండి. కాలుష్యం బారిన పడేసే అభివృద్ధి మాకు వద్దు అంటూ కళ్లనీళ్ల పర్యంతమయ్యారు. జైలులో ఉన్న 36 మంది విడుదలకు కృషి చేయాలని కోరారు. శ్రీ పవన్ కళ్యాణ్ గారితో న్యాయం జరుగుతుందని నమ్ముతున్నట్లు పేర్కొన్నారు.

దివీస్ పరిశ్రమ ప్రభావిత ప్రాంతంలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభ - ఫొటోలు

 

అంబేడ్కర్ సాక్షిగా...

మహిళల రోదనతో చలించిన పవన్ కల్యాణ్ 


కొత్త పాకలు గ్రామ మహిళల రోదన జనసేన అధ్యక్షుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారిని కదిలించింది. ఒకరి వెంట ఒకరు తాము పడుతున్న కష్టాలను, ఎదుర్కొంటున్న అవమానాలను వివరిస్తుంటే చలించిపోయారు జనసేనాని. తూర్పుగోదావరి జిల్లా తొండంగి మండలం కొత్తపాకలు గ్రామంలోకి శ్రీ పవన్ కళ్యాణ్ గారు అడుగిడగానే అక్కడే ఉన్న అంబేడ్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి గజమాల వేశారు. అదే ప్రాంతంలో పోలీసులు బీభత్సం సృష్టించారని, 160 మందిపై కేసులు పెట్టారని, 36 మంది ఇంకా జైలులోనే మగ్గుతున్నారని ఆ ప్రాంత మహిళలు వివరించారు. ఆ క్రమంలో తమకు న్యాయం జరిగేలా చూడాలంటూ అంబేడ్కర్ కు వేసిన దండను పోలీసులు తొలగించి అపచారానికి పాల్పడ్డారని విలపించారు. తమను గాయపరచారంటూ గోడు వెళ్లబోసుకున్నారు.

శ్రీమతి మరియ అనే మహిళ మాట్లాడుతూ తన భర్త అక్కడ లేకపోయినా అన్యాయంగా అరెస్టు చేసి నాన్ బెయిలబుల్ కేసు పెట్టారనీ, ఇప్పటికీ జైలులోనే ఉంచారంటూ కన్నీటిపర్యంతమయ్యారు. "నన్ను కూడా కొట్టి, పోలీసు స్టేషన్ కు తీసుకెళ్లారు. జనసేన నేతలు నన్ను విడిపించారు. రోజువారీ కూలి చేసుకునే తన భర్త జైలు పాలు కావడంతో కూతుళ్లను తానెలా పోషించాలి" అని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో అవమానాలు పడ్డాము, భయభయంగా బతుకుతున్నాము అని వివరించారు. మాకీ పరిశ్రమ వద్దంటూ రోదించారు. మరో వృద్ధురాలు మాట్లాడుతూ నా కొడుకును తీసుకెళ్లారు.. ఎప్పుడొస్తాడో తెలియదు" అని కన్నీటి పర్యంతమయ్యారు. ఆ ప్రాంత మహిళల వేదనకు  శ్రీ పవన్ కళ్యాణ్ గారు చలించిపోయారు  మనసు కూడతీసుకొని ఇక్కడి ఆడపడుచుల వేదన మనసును కదిలించిందని అన్నారు. ధైర్యంగా ఉండండి....అన్ని విధాలా అండగా ఉంటాం అని ఓదార్చారు.
జనసేన: అన్నవరంలో పవన్ కళ్యాణ్ రోడ్ షో ఫొటోస్

 


అన్నవరంలో అభిమానులకు అభివాదం చేస్తున్న పవన్ కళ్యాణ్


8, జనవరి 2021, శుక్రవారం

దివీస్ ల్యాబ్ ప్రభావిత ప్రాంతాల్లో పర్యటనకు గాను రాజమండ్రి ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్


 

జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కొద్దిసేపటి క్రితమే రాజమండ్రి విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి అన్నవరం మీదుగా దివీస్ ప్రభావిత ప్రాంతాలకు పర్యటనకు బయలుదేరారు. పవన్ కళ్యాణ్ గారి వెంట పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ గారు ఉన్నారు.

దివిస్ లాబొరేటరీస్ కాలుష్యంతో ప్రభావితమయ్యే ప్రాంతాల్లో పర్యటించి బాధితులకు బాసటగా నిలిచేందుకు పవన్ కళ్యాణ్ ఈ పర్యటన తలపెట్టగా తూర్పుగోదావరి ఎస్పీ తొలుత అనుమతి ఇచ్చి అనంతరం నిరాకరించారు.

దీంతో పవన్ కళ్యాణ్ ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ శనివారం ఉదయం రాజమండ్రి చేరుకుంటానని కార్యక్రమాలకు హాజరవుతానని ప్రకటించారు.. తూర్పుగోదావరి జిల్లా జనసేన నాయకులు ఎస్పీ కార్యాలయానికి వెళ్లి ఈ కార్యక్రమానికి అనుమతి నిరాకరించడంపై తమ అసంతృప్తిని తెలియజేశారు.

ఈ పరిణామాల తరువాత మళ్లీ పవన్ కళ్యాణ్ చేపట్టిన పర్యటనకు కొత్త పాకల గ్రామంలో నిర్వహించే సభకు పోలీసులు అనుమతులు మంజూరు చేశారు. 

శుక్రవారం రాత్రి పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్‌కు తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీమ్ అస్మి ఫోన్ చేసి ఈ కార్యక్రమాలకు అనుమతిస్తున్నట్లు తెలియజేశారు. 

రాజమండ్రి విమానాశ్రయంలో పవన్ కళ్యాణ్, నాదెండ్ల మనోహర్

పవన్ కళ్యాణ్ బహిరంగ సభపై ఆంక్షలా?

నాదెండ్ల మనోహర్, పవన్ కళ్యాణ్


* తూ.గో జిల్లా ఎస్పీ వైఖరి గర్హనీయం 
* వైఎస్సార్సీపీ ఆదేశాలు అమలు చేస్తున్నట్లు భావించాల్సి ఉంటుంది
* జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్

తూర్పుగోదావరి జిల్లా తుని సమీపంలోని కొత్తపాకల గ్రామంలో 9వ తేదీన ఏర్పాటు చేసిన జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి బహిరంగ సభకు అనుమతులు లేవని చివరి నిమిషంలో జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మీ ప్రకటించడం అప్రజాస్వామికం అని జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు.

‘‘పోలీసు వ్యవస్థకే తలవంపులు. తొండంగి మండలం కొత్తపాకల గ్రామంలో ఏర్పాటు చేస్తున్న దివీస్ ల్యాబరేటరీస్ పై అక్కడ సమీప గ్రామస్థులు వ్యక్తం చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సభ నిర్వహిస్తున్నట్లు ముందుగానే జనసేన నాయకులు ఎస్పీకి తెలియజేశారు. 

సభకు అనుమతి కావాలని, పవన్ కళ్యాణ్ గారికి పూర్తిస్థాయి రక్షణ కల్పించాలని కోరినప్పుడు ఆయన సుముఖుత వ్యక్తం చేసి, సభ నిర్వహించడానికి ఆమోదం తెలిపారు. 

అయితే ఈ రోజు సాయంత్రం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి సభకు అనుమతులు రద్దు చేసుకుంటున్నామని, 144 సెక్షన్ విధిస్తున్నామని ఎస్పీ చెప్పడం వైఎస్ఆర్సీపీ ఆదేశాలను అమలు చేయడంగానే భావిస్తున్నాం. 

దివీస్ కంపెనీ వల్ల కాలుష్యం బారిన పడుతున్నామని వేలాదిమంది ప్రజలు ఆవేదన, ఆక్రోశం, నిస్సహాయత వ్యక్తం చేస్తున్న తరుణంలో శాంతియుతంగా వారి మనోభావాలను అర్ధం చేసుకోవడానికి వెళ్తున్న పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమానికి పోలీసుల ద్వారా అవరోధాలు సృష్టించడానికి జగన్ రెడ్డి ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తున్నట్లు భావిస్తున్నాం. 

ఏదీఏమైనప్పటికీ కార్యక్రమాన్ని యధావిధిగా 9వ తేదీ మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తాం. ప్రజల పక్షాన నిలబడతాం. ప్రజా గళాన్ని వినిపిస్తాం. పోలీసులను అడ్డుపెట్టుకొని జనసేన కార్యక్రమాలని అడ్డుకోవాలని ప్రభుత్వం ప్రయత్నిస్తే అందుకు జగన్ రెడ్డిగారి ప్రభుత్వమే బాధ్యత వహించాల్సి ఉంటుంది. పోలీసులు ప్రజల పక్షాన ప్రజాస్వామ్య వ్యవస్థలో పని చేస్తున్నామన్న విషయాన్ని గుర్తెరగాలి’’ అని నాదెండ్ల ఓ ప్రకటనలో పేర్కొన్నారు.

7, జనవరి 2021, గురువారం

పవన్ కళ్యాణ్: ఆలయాల రక్షణపై ప్రభుత్వం తన వైఖరి వెల్లడించాలి

చినజీయర్ స్వామి, పవన్ కళ్యాణ్

 

కమీషన్లు వచ్చే కాంట్రాక్ట్ పనులపైనే కాదు.. సి.సి.కెమెరాల ఏర్పాటుపైనా దృష్టిపెట్టాలి

లయాల ఆస్తులు, విగ్రహాల పరిరక్షణ విషయంలో ప్రభుత్వ వైఖరి... తీసుకొనే చర్యల గురించి ఇప్పటికీ ఎలాంటి స్పష్టత లేదు. అంతర్వేదిలో రథం దగ్ధం ఘటన సమయంలోనే అన్ని ఆలయాలలో సి.సి.కెమెరాలు ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు రామతీర్థంలో శ్రీ కోదండరామ స్వామి విగ్రహం తల నరికిన దుస్సంఘటన తరవాత అదే మాట చెబుతున్నారు. రాష్ట్రంలో దేవాదాయ శాఖ పరిధిలో సుమారు 26వేల ఆలయాలు ఉన్నాయి. అందులో ఎన్ని ఆలయాలకు సి.సి.కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు? అనేది ప్రశ్నార్థకమే. ఆలయాలే ఆ కెమెరాలను, పర్యవేక్షణను సిద్ధం చేసుకోవాలని ప్రభుత్వం చెబుతుండటం సరికాదు. ధూప దీప నైవేద్యాలకు కూడా నిధులు సమకూర్చని ప్రభుత్వం ఇప్పుడు సి.సి. కెమెరాలను ఆలయాలే ఏర్పాటు చేసుకోవాలనడం బాధ్యతను విస్మరించడమే. 

గత ప్రభుత్వ కాలంలో కూల్చినవాటిని కడుతున్నామని చెబుతున్న ఈ పాలక పక్షం గత 18 నెలలుగా ఈ విషయాన్ని ఎందుకు పట్టించుకోలేదు. విగ్రహాల ధ్వంసం ఘటనల క్రమంలోనే ప్రభుత్వం విజయవాడలో ఆలయాల పునర్నిర్మాణం అంటోంది.  విజయవాడ దుర్గ గుడి అభివృద్ధికి రూ.70 కోట్లు కేటాయించి పనులు మొదలుపెడతామన్నారు. ఆలయాల పునర్నిర్మాణం, అభివృద్ధి పనులు ప్రభుత్వ విధి నిర్వహణలో భాగమే. వారు హిందూ ధర్మ పరిరక్షణ కోసం ప్రత్యేకంగా చేస్తున్న పనులుగా వాటిని చూడలేము. కాంట్రాక్టుల్లో వచ్చే కమీషన్ల మీదపెట్టే శ్రద్ధ రాష్ట్రవ్యాప్తంగా 26వేల ఆలయాలకు సి.సి.కెమెరాలు ఏర్పాటు మీదా దృష్టిపెట్టాలి. ఉత్సవ విగ్రహాల్లా ఉండే కెమెరాలు కాకుండా ఆధునిక సాంకేతికత ఉన్న కెమెరాలను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షించే వ్యవస్థను సిద్ధం చేయాలి. లేదంటే ఈ ప్రభుత్వం కేవలం ప్రకటనలకు, ప్రచారానికి మాత్రమే సి.సి. కెమెరాలు అనే మాట చెబుతుందని భావించాల్సి వస్తుంది.

 

(పవన్ కల్యాణ్)

అధ్యక్షులు, జనసేన

6, జనవరి 2021, బుధవారం

పవన్ కళ్యాణ్: ‘గెరిల్లా వార్ ఫేర్ అంటూ జగన్‌మోహన్ రెడ్డి బాధ్యత నుంచి తప్పించుకోజూస్తున్నారు

పవన్ కళ్యాణ్, చినజీయర్ స్వామి, చిన్నజీయర్ స్వామి

కటి కాదు రెండు కాదు ఏకంగా 100కు పైగా దేవాలయాలపై గత రెండేళ్ల కాలంలో దాడులు జరిగాయి.. రథాలు దగ్ధాలు, దేవతామూర్తుల విగ్రహాలు ధ్వంసమయ్యాయి.. జరుగుతున్న ఈ ఆరాచకంపై మాట్లాడితే “ప్రతిపక్షాలు ఈ రాష్ట్రంలో రాజకీయ గెరిల్లా వార్ ఫేర్ నడిపిస్తున్నాయి” అని ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి చెప్పడం బాధ్యత నుంచి తప్పించుకునే విధంగా ఉందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

‘‘ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న మీరు ఆధారాలు లేకుండా మాట్లాడితే ప్రజలు హర్షించరు. మీరు ఎంతటి శక్తిమంతులో ఈ దేశ ప్రజలందరికి తెలుసు. మీరు ఒక్క లేఖ రాస్తే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు క్షణంలో బదిలీ అయిపోతారు. అంతటి శక్తి ఉన్న మీపై గెరిల్లా వార్ ఫేర్ చేయడానికి ఎవరు సాహసిస్తారు. 151 మంది ఎమ్మెల్యేలు, 22 మంది ఎంపీలు, 115 మంది ఐ.పి.ఎస్ లు, మరో 115 మంది అదనపు ఎస్.పి.లు వేలాది మంది పోలీసు సిబ్బంది మీ చేతుల్లో ఉండగా విగ్రహాలను ధ్వంసం చేసే వారిని పట్టుకోలేకపోవడం విడ్డూరంగా ఉంది. నిస్సహాయుడైన డాక్టర్ సుధాకర్ గారి పైన, సోషల్ మీడియాలో మీపైన, మీ పార్టీ వారిపైన పోస్టులు పెట్టేవారిపై అత్యుత్సాహంతో కేసులు పెట్టే పోలీసులు దేవుడి విగ్రహాలను ధ్వంసం చేసేవారిని పట్టుకుని ఎందుకు కేసులు పెట్టలేకపోతున్నారు. ఊరికో వాలంటీరు చొప్పున 2.60 లక్షల మందిని నియమించారు కదా .. వారు కూడా సమాచారం ఇవ్వలేకపొతున్నారా? ఎక్కడ వుంది లోపం? మీలోనా? మీ నీడలో వున్న వ్యవస్థలోనా?

పైగా ప్రతిపక్షాలు అన్నింటినీ ఒకే గాటన కట్టి దుష్ప్రచారం చేస్తున్నారని మీరు చెప్పడం 'ఆడలేక మద్దెలు ఓడు' అన్నట్లు ఉంది. గత రెండేళ్లుగా సహనంతో ఉన్న పీఠాధిపతులు సైతం రోడ్డుపైకి రావలసిన పరిస్థితిని ఈ ప్రభుత్వం తీసుకొచ్చింది.ఇకనైనా ఇటువంటి మాటలు కట్టిపెట్టి దోషులను పట్టుకుని, వారిని ప్రజల ముందు నిలబెట్టే పనిలో ఉంటే మంచిది.’’ అని పవన్ కళ్యాణ్ అన్నారు.

1, జనవరి 2021, శుక్రవారం

పవన్ కళ్యాణ్ : హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం ప్రభుత్వ వైఫల్యమే

పవన్ కళ్యాణ్

పాకిస్థాన్ దేశంలోనే ఆలయాల ధ్వంసం గురించి చదువుతున్నాం... మన రాష్ట్రంలో దేవతా విగ్రహాల ధ్వంసాన్ని చూస్తున్నాం 

దేవుడిపై భారం వేయడం ముఖ్యమంత్రి ఉదాసీనతను తెలియచేస్తోంది 

‘‘ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో దేవుడి విగ్రహం ధ్వంసంతో నూతన సంవత్సరానికి స్వాగతం పలికారు. ఈ పరిస్థితి నెలకొనడం అత్యంత దురదృష్టకరం. హిందూ ధర్మాన్ని విశ్వసించేవారి మనోభావాలను దెబ్బ తీసే ఘటన రాజమహేంద్రవరంలో చోటు చేసుకొందని తెలిసి ఆవేదనకు లోనయ్యాను. రాజమహేంద్రవరంలో శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం చేతులను ఖండించడం వేదనకు లోను చేసింది’’ అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.

‘‘పాకిస్థాన్ దేశంలో హిందూ ఆలయాలను ధ్వంసం చేసి, విగ్రహాలు పగలగొడుతూ ఉంటారని చదువుతుంటాం. ఇప్పుడు మన రాష్ట్రంలో హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం, ఆలయ రథాల దగ్ధం చూస్తున్నాం.  రామ నామాన్ని జపించే పవిత్ర భూమి మనది... రామ కోటి సభక్తికంగా రాసే నేల ఇది... రామాలయం లేని ఊరంటూ కనిపించదు మన దేశంలో. రాముణ్ణి ఆదర్శంగా తీసుకొంటూ ఉంటాం. మన రాష్ట్రంలో ఆ భావనలు చెరిపేయాలనుకొంటున్నారా? భద్రాచలం తరహాలో అధికారికంగా శ్రీరామనవమి చేయాలనుకొన్న రామతీర్థం క్షేత్రంలో కొద్ది రోజుల కిందటే కోదండరాములవారి విగ్రహం తలను నరికి పడేసే మత మౌఢ్యం పెచ్చరిల్లడం ఆందోళనకరం. ఈ బాధ భక్తుల మనసుల్లో ఇంకా పచ్చిగానే ఉంది. ఇప్పుడు  దేవ గణాలకు సేనాధిపతి అయిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి విగ్రహం చేతులను నరికేయడం ధ్వంస రచన పరాకాష్టకు చేరుతున్నట్లు అనిపిస్తోంది. 

రామతీర్థం క్షేత్రంలో కోదండ రాముని విగ్రహాన్ని పగలగొట్టడం.. అంతకు ముందు పలు చోట్ల విగ్రహాలు ధ్వంసం చేయడం, రథాలను తగలపెట్టడం చూస్తుంటే ఒక పథకం ప్రకారమే ఈ దుశ్చర్యలకు తెగబడుతున్నారు.  రాష్ట్రంలో ఒకరి మత విశ్వాసాలను మరొకరు గౌరవించే సుహృద్భావ వాతావరణాన్ని తీసుకురావడంలో ప్రభుత్వం తగిన విధంగా వ్యవహరించడం లేదు. రామతీర్థం క్షేత్రంలో శ్రీ కోదండరాముల వారి  విగ్రహం తలను నరికిన ఘటనపై రాష్ట్ర ముఖ్యమంత్రి స్పందన ఉదాసీనంగా ఉంది. దేవుడితో చెలగాటమాడితే దేవుడే శిక్షిస్తాడు అంటూ చెప్పడం చూస్తే ఈ వరుస దాడులపై ఆయన ఎంత నిర్లిప్తంగా ఉన్నారో అర్థం చేసుకోవచ్చు. ఇలాంటి వ్యాఖ్యలు నేరం చేసేవారిని నిలువరించవు సరికదా... మరో దుశ్చర్యకు ఊతం ఇచ్చేలా ఉన్నాయి.  ఈ ఘటనలకు ఇతర పక్షాలే కారణం అంటూ అధికార పక్షంవాళ్లు చెబుతున్నారు. మరి వారి చేతుల్లోనే పోలీసు, నిఘా విభాగాలు ఉంటాయి కదా... బాధ్యులను ఇప్పటి వరకూ ఎందుకు గుర్తించి అరెస్టు చేయడం లేదు.

దేవుడిపై భారం వేసేసి ఆలయాలను కాపాడే బాధ్యత నుంచి తప్పించుకోవాలని ప్రభుత్వం చూస్తుంది. అంతర్వేది ఘటనపై నిరసన తెలిపినవారిపైనా... అక్కడ ఓ ప్రార్థన మందిరానికి నష్టం జరిగితే ఆఘమేఘాలపై కేసులుపెట్టిన ప్రభుత్వం - హిందూ ఆలయాలు, దేవత విగ్రహాలను ధ్వంసం చేస్తే ఎందుకు దేవుడిపై భారం వేస్తుంది. విజయవాడ అమ్మవారి ఆలయ రథంలో వెండి విగ్రహాల అపహరణ కేసు ఏమైందో ఎవరికీ తెలియదు. పిఠాపురం, కొండబిట్రగుంట కేసులు ఎటుపోయాయో ప్రజలకు అర్థం కావడం లేదు. వరుస ఘటనలు చూస్తుంటే రాష్ట్రంలో దేవాదాయ శాఖ అనేది ఒకటి ఉందా అనిపిస్తుంది. హిందూ దేవాలయాలపై సాగుతున్న దాడులను ఏ మత విశ్వాసాన్ని ఆచరించేవారైనా నిరసించాలి. అన్ని మతాల పెద్దలు ఒక వేదికపైకి వచ్చి విగ్రహ ధ్వంసాలు, రథాల దగ్ధాలను ఖండించాలి. అప్పుడే మత సామరస్యం, లౌకిక వాదం పరిఢవిల్లుతాయి’’ అన్నారు పవన్ కళ్యాణ్.